: తెలంగాణలో వెనుకబాటుతనం... కేసీఆర్ దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరి


కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి, తెలుగు రాష్ట్రాల్లో పాలనపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ 15 నెలల పాలనలో ప్రజాజీవితం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. కులమతాలను పెంచిపోషించేందుకే బీజేపీ రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం వెనుకాడుతోందని హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్నారు. గుజరాత్ లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం ప్రభుత్వాలకు గుణపాఠం కావాలని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తే సమస్యలు ఉత్పన్నం కావని ఏచూరి సూచించారు. వెనుకబాటుతనం నిర్మూలన కోసమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న ఆయన, సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని విస్మరించిందని చురకంటించారు. కేసీఆర్ గనుక దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లో లాంటి ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. ఏపీ రాజధాని భూముల సేకరణ 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా జరుగుతోందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న జరిగే సమ్మెపై కేంద్రం దాటవేత వైఖరి అవలంబిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News