: మోదీ ప్రత్యేక దృష్టి... రెండేళ్లలో నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైలు పరుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని, అందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ప్రతి నెలా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రగతి సమీక్షలు జరిపే ప్రధాని, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల జాబితాలో ఈ రైలు మార్గం ఉందని గుర్తు చేసిన ఆయన, జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు చూపుతున్న శ్రద్ధను మోదీ అభినందించారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఇతర ప్రాజెక్టుల వివరాలను చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ప్రధానికి వివరించారు. రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. 50 శాతం నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు పూర్తవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ తెలియజేశారు.