: మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్న 'స్పాట్ ఫిక్సింగ్' ఆటగాళ్లు!
పాకిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్, మహ్మద్ అమీర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్నారా? అంటే పీసీబీ పెద్దలు అవుననే అంటున్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ ముగ్గురు పాక్ క్రికెటర్లపై నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుంది. 2010లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడిన సందర్భంగా వీరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఓ స్థానిక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. అప్పటి వరకు మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే ఉంటుందని తెలిసిన అభిమానులకు స్పాట్ ఫిక్సింగ్ ను ఆసిఫ్, భట్, అమీర్ పరిచయం చేశారు. వీడియో పుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వీరు ముగ్గురికి ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. సెప్టెంబర్ 1తో వీరిపై నిషేధం ముగియనుండడంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పీసీబీ ఆ ముగ్గురినీ హెడ్ ఆఫీస్ కు పిలిపించుకుంది. లాహోర్ లోని హెడ్ ఆఫీస్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్న పీసీబీ, వారిని మళ్లీ క్రీజులోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.