: అతడి పిలుపే ఓ ప్రభంజనం!
గుజరాత్ లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పటేళ్లు తమకు ఓబీసీ రిజర్వేషన్ కావాలంటూ వీధుల్లోకి రాగా, పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇప్పటిదాకా సభలు, సమావేశాలతో ఉద్యమానికి పునాది వేసుకున్న పటేళ్లు, తాజాగా, ఆందోళన కార్యక్రమాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. తత్ఫలితంగా చెలరేగిన అల్లర్లు గుజరాత్ ను అట్టుడికిస్తున్నాయి. ఈ విషయంలో సంయమనం పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇన్నాళ్లు మీడియా ప్రచారానికి నోచుకుని పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం ఇప్పటికిప్పుడు యావత్ దేశం దృష్టిని తనవైపుకు ఎలా తిప్పుకోగలిగింది? అంటే, అందుకు ఓ యువకుడి పేరు చెప్పుకోవాలి. అతడి పేరు హార్దిక్ పటేల్ (22). బీకాం చదివాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. గుజరాత్ లోని సౌరాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో ఉండే మెజారిటీ వర్గం పటేళ్లు. హార్దిక్ కూడా ఆ వర్గానికి చెందినవాడే. అయితే, రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గంలో సంపన్నులున్నా, అత్యధికులు మధ్యతరగతి జీవులే. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండడం, నిరుద్యోగం, విద్యా సంబంధ ఫీజుల మోత ఇత్యాది అంశాలన్నీ పటేల్ వర్గం యువతలో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. రిజర్వేషన్లలో తమకు న్యాయం జరగడంలేదని తెలుస్తున్నా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఈ పరిణామమే హార్దిక్ ను ఆలోచింపజేసింది. తొలుత రాష్ట్రంలోని పటేల్ సామాజిక వర్గం గురించి కూలంకషంగా తెలుసుకున్నాడు. ఏం చేస్తే పటేల్ యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయో గుర్తెరిగిన పిమ్మట ఇక ఆలోచించదలచుకోలేదు. వెంటనే పటేల్, పటీదార్ అమానత్ ఆందోళన్ సమితిని స్థాపించాడు. పటేల్ సామాజిక వర్గంలో పటీదార్లు, లువా పటేళ్లు అనే వర్గాలుంటాయి. వారందరినీ ఏకం చేసి ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలన్నది ఆ యువకుడి ప్రణాళిక. అందుకు అనుగుణంగానే అడుగులు వేశాడు. కొద్ది మందితో ఓ మోస్తరు సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో చైతన్యం కలిగించాడు. హార్దిక్ మాటలు బాణాల్లాంటివి... కచ్చితంగా అవి లక్ష్యాన్ని తాకాయి! ఒకరి నుంచి మరొకరికి భావజాల వ్యాప్తి జరిగింది. హార్దిక్ కూడా పెద్ద డైలాగుల జోలికి వెళ్లకుండా, ఎందుకు చేయాలి? ఏం చేయాలి? అంటూ స్పష్టంగా విడమర్చి చెబుతూ సామాన్యుల్లో సైతం రిజర్వేషన్లపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. తమ సామాజిక వర్గ భవిష్యత్తును విజయవంతంగా కళ్లకు కట్టాడు. అక్కడి నుంచి మొదలైంది అతడి హవా. చిరు సమావేశాల నుంచి భారీ బహిరంగ సభల స్థాయికి ఎదిగింది ఉద్యమం. అతడి పిలుపే ఓ ప్రభంజనం అన్నట్టు తయారైంది గుజరాత్ లో వాతావరణం. హార్ధిక్ సభకు వస్తున్నాడంటే పిల్లాపెద్దలు, ఆడామగా తేడా లేకుండా అందరూ వచ్చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కావడంతో సహజంగానే మీడియా బాగా ప్రాధాన్యం కల్పించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసింది. ఓ సభ నేపథ్యంలో, నిబంధనల పేరిట పోలీసులు హార్దిక్ ను అదుపులోకి తీసుకోవడంతో పటేళ్లు ఆగ్రహోదగ్రులయ్యారు. దాంతో, అల్లర్లు ప్రారంభం కాగా, పలువురు ప్రాణాలు విడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో జరుగుతుండడంతో ఈ ఉద్యమంపై కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది.