: ఉల్లి అవసరాలపై తెలంగాణకు లేఖలు రాశాం... అయినా స్పందన లేదు: కేంద్ర మంత్రి
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ఉల్లిపాయ అవసరాలపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రెండుసార్లు లేఖ రాసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కందూరియా తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దాంతో ఎలాంటి సాయం చేయలేకపోతున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉల్లి అవసరాలను గుర్తించి ఇప్పటికే టెండర్లు నిర్వహించామన్నారు. అంతేగాక తెలంగాణలో నెలకొన్న కరువుపైనా తమకు ఎలాంటి నివేదిక అందలేదని మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో మంత్రి వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం బీమా యోజన చేపట్టామని, ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.