: కేవలం రెండు నెలలు... సామాన్యుడి స్థాయి నుంచి 'హీరో'గా ఎదిగిన హార్దిక్ పటేల్!


ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం గుజరాత్ లోని పటేల్ (పతేదార్) కులస్తులు రోడ్లెక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులు, ఆదివాసీలు, బీసీలకు విద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ... అప్పట్లో వారు నిరసన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత వారు మళ్లీ రోడ్డెక్కారు. తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏకంగా పోరాట బాటనే పట్టారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమేణా హింసాత్మక రూపు దాల్చింది. పటేల్ కులానికి చెందిన లక్షలాది మంది తమ డిమాండ్ ను సాధించుకునేందుకు కదం తొక్కుతున్నారు. ఒక్క గుజరాత్ లోనే కాదు, యావత్ భారతదేశ దృష్టిని ఈ ఉద్యమం ఆకర్షిస్తోంది. లక్షలాది మంది జనాలను ఒక్కతాటి మీదకు తీసుకు రావాలంటే పండిపోయిన ఏ రాజకీయవేత్తో... లేక పోరాటాలు, ఉద్యమాలకు బాగా అలవాటైన వ్యక్తో నాయకత్వం వహించాలి. కానీ, ఇంతమంది పటేల్ కులస్తులను ఏకం చేసి, రాష్ట్రాన్ని స్తంభింపజేసిన ఆ 'శక్తి' ఓ నూనూగు మీసాల యువకుడు కావడం విశేషం. ఆ యువకుడి పేరే హార్దిక్ పటేల్. వయసు 22 సంవత్సరాలు మాత్రమే! గుజరాత్ నుంచి వచ్చిన రెండో మోదీగా ఇప్పుడు అతను ఖ్యాతిగాంచాడు. చదువులో టాపర్ కాకపోయినప్పటికీ (డిగ్రీలో 50 శాతం మార్కులు కూడా రాలేదు)... తన వాగ్ధాటితో హార్దిక్ పటేల్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పటేల్ సామాజికవర్గంలో హార్దిక్ ఇప్పుడొక హీరో. కేవలం రెండు నెలల క్రితం అతను ప్రారంభించిన ఈ పోరాటానికి యావత్ సామాజికవర్గం మద్దతు పలకడంతో, అతని ఇమేజ్ దిగంతాలకు వ్యాపించింది. తమను ఓబీసీల్లో చేర్చకపోతే 2017లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాధికడతామంటూ సవాల్ విసిరి... బీజేపీకి హార్దిక్ పటేల్ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. హార్దిక్ పటేల్ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే, బీకాం పూర్తి చేసి, డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్ అతని స్వస్థలం. అతని తండ్రి ఓ చిన్న వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే, తన సామాజికవర్గం అభ్యున్నతి కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. "90 మార్కులు సాధించినా పటేల్ కులానికి చెందిన విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు రావడం లేదు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులైతే 45 మార్కులు వచ్చినా డాక్టర్ అయిపోతున్నారు"... హార్దిక్ పటేల్ ఆవేదన ఇదే. ఈ నేపథ్యంలోనే, తమ బతుకులు బాగుపడటానికి తమను ఓబీసీల్లో చేర్చండి అంటూ ఉద్యమానికి ఊపిరి ఊదాడు. ఇప్పుడు అతను నిర్వహిస్తున్న సభలకు లక్షలాది మంది తరలి వస్తుండటం, రాష్ట్రంలోని అధికార బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో 15 శాతం వరకు పటేల్ కులస్తులు ఉన్నారు. దీంతో, ఈ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితిలో బీజేపీ ఎంతమాత్రం లేదు. ఇదే సమయంలో, వారికి రిజర్వేషన్లు కల్పించడం కూడా మరో కొత్త సమస్యను ఉత్పన్నం చేసేదే. మరోవైపు, పటేల్ సామాజికవర్గానికి చెందిన రాజకీయవేత్తలు కూడా ఈ నిరసన కార్యక్రమాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇతర సామాజికవర్గాలకు చెందిన ప్రజలు తమకు దూరమవుతారనే భయం వారిది. సాక్షాత్తు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్, పార్టీ అధ్యక్షుడు ఆర్.సి.ఫల్దూ కూడా పటేల్ కులానికి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం! 22 ఏళ్ల హార్దిక్ పటేల్ కు చెందిన గ్రూప్ మొత్తం యువకులతో నిండి ఉంటుంది. తమ పోరాట లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరంతా సోషల్ మీడియానే వినియోగిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్స్ యాప్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఉద్యమాన్ని అనతికాలంలోనే రాష్ట్ర వ్యాప్తం చేశారు. గత 50 రోజుల నుంచి తన కమ్యూనిటీ ప్రజలను ఏకం చేయడానికి హార్దిక్ పటేల్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటినీ చుట్టేశాడు. తమ సమస్యల సాధన కోసం హార్దిక్ చేస్తున్న కృషిని పటేల్ సామాజిక వర్గం మొత్తం గుర్తించింది. దీంతో, హార్దిక్ పిలుపు మేరకు వారంతా రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు, చివరకు బంద్ కూడా నిర్వహించారు. తమ డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఢిల్లీలో తమ నిరసన వ్యక్తం చేస్తామని కూడా హార్దిక్ హెచ్చరించాడు. అంటే, తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కూడా అతను వెనుకాడటం లేదన్నమాట. ఈ లక్షణాలే అతన్ని గుజరాత్ లో హీరోను చేశాయి. మరి, తన లక్ష్యాన్ని హార్దిక్ పటేల్ సాధిస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి!

  • Loading...

More Telugu News