: సోదరి వైద్యం కోసం దొంగలుగా మారిన అన్నదమ్ములు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సోదరిని కాపాడుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు దొంగలుగా మారారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పద్మాకర్ చౌబే ముంబైలో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం సోదరికి బ్లడ్ కేన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు వైద్యం చేయించేందుకు కుటుంబం దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు. ఇక వైద్యానికి తమ దగ్గర ఏమీ లేకపోవడంతో పద్మాకర్ దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇందు కోసం సోదరుడు రత్నాకర్, స్నేహితులు శివంత్ శుక్లా, యాదవ్ సహాయం తీసుకున్నాడు. చోరీకి పక్కా ప్రణాళిక వేసిన పద్మాకర్, స్నేహితుడు శివంత్ శుక్లా పని చేసే పెట్రోలు బంక్ నుంచి బ్యాంకులో జమచేసేందుకు పెద్దమొత్తం తీసుకెళ్తున్నారని తెలుసుకుని ప్లాన్ అమలు చేశాడు. సోదరుడు రత్నాకర్ తో బైక్ పై వెళ్లి పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి చేసి 17.5 లక్షల రూపాయలు దోచుకెళ్లిపోయారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా సిబ్బందిని విచారించిన పోలీసులు శివంత్ శుక్లాను విచారించే సరికి అసలు విషయం తెలుసుకున్నారు. దీంతో నిందితుల నుంచి 3.1 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా సోదరి వైద్యం కోసం దొంగతనం చేసినట్టు గుర్తించారు. వీరు దొంగతనానికి పాల్పడడం ఇదే తొలిసారని కూడా పోలీసులు పేర్కొన్నారు.