: విజయవాడ మెట్రోరైల్... ఏపీ రాజధానికి నెల రోజుల క్రితమే షాకిచ్చిన కేంద్రం!
ఆంధ్రప్రదేశ్ రాజధానికి నెల రోజుల ముందే కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ అనర్హమని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజుల ముందే లేఖ రాసింది. కేంద్రం పంపిన లేఖ ప్రకారం...ఏదయినా పట్టణంలో మెట్రోరైల్ నిర్మించాలంటే 20 లక్షల మంది జనాభా కలిగి ఉండాలి. విజయవాడ జనాభా అంత లేదు. అంతే కాకుండా 2019-2020 నాటికి రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగేలా విజయవాడ కనిపించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. విజయవాడ మెట్రోరైల్ డీపీఆర్ ను పరిశీలించిన కేంద్రం... కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు అర్హతలు లేవని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అలాగే డీపీఆర్ లో భద్రత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, మల్టీ మోడల్ రంగాల్లో ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించలేదని కేంద్రం పేర్కొంది. మెట్రో రైల్ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణకు పన్నులు, సెస్ లు విధించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పొందుపరచలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాల్లో నిలకడత్వం లేదని లోపాలు ఎత్తి చూపింది. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతానికి మించదని, అది కూడా భూసేకరణకు అవసరమయ్యే ఖర్చుతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.