: నాక్కావాల్సింది 'హోదా' కాదు, అభివృద్ధి... ఏం చేస్తారో చెప్పండి?: మోదీని ప్రశ్నించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడమే తన లక్ష్యమని, అందుకోసం ఏం చేస్తారో చెప్పండని ప్రధాని మోదీని తాను అడిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తనకు కావాల్సింది అభివృద్ధి మాత్రమేనని, అది ప్రత్యేక హోదా రూపంలో జరిగినా, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో దగ్గరైనా తనకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో పరిశ్రమలు లేవని, ఈ కారణంగా నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉందని, ఈ లోటు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన వివరించారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి పథంలో వెళ్లేలా చూడాలని విన్నవించినట్టు తెలిపారు. తాను తొలుత ప్రత్యేక హోదాను మాత్రమే కోరుకున్నానని, హోదా దక్కని పక్షంలో, అంతే తరహా లబ్ధి చేకూర్చే ప్యాకేజీలను డిమాండ్ చేస్తున్నామని వివరించారు. కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినందునే ఇన్ని సమస్యలు వచ్చాయని ఆయన ఆరోపించారు. రైల్వే జోన్, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి, దుగ్గరాజపట్నంలో పోర్టు అభివృద్ధి, ఐఓసీ, హెచ్పీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు, కడపలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్ తదితర విషయాలను ప్రధానితో చర్చించామని తెలిపారు. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ తదితరాలన్నీ విభజన చట్టంలో ఉన్నాయని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరలో చేపట్టాలని కోరినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. 10వ షెడ్యూల్ లో పేర్కొన్న విషయాలపై తెలంగాణతో వస్తున్న గొడవలపైనా ప్రధానితో మాట్లాడినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News