: నేటి మార్కెట్ రోలర్ కోస్టర్...చివరికి సెన్సెక్స్ 290 పాయింట్ల లాభం!


సెషన్ ఆరంభంలో 350 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, ఆ తరువాత రెండు గంటల వ్యవధిలో నష్టాల్లోకి, మరో గంట గడిచేసరికి 300 పాయింట్లకు పైగా నష్టం. అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో మార్కెట్ బుల్ జంప్, కాసేపు ఒడిదుడుకులు, ఒంటిగంట దాటేసరికి తిరిగి లాభాల్లోకి... చివరికి 290 పాయింట్ల లాభం. ఇది... సోమవారం నాటి భారీ పతనం తరువాత స్టాక్ మార్కెట్లు నడిచిన తీరు. ఓ రోలర్ కోస్టర్ ను తలపించేలా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచికలు కొంత తేరుకున్నాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 290.82 పాయింట్లు పెరిగి 1.13 శాతం లాభంతో 26,032.38 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 71.70 పాయింట్లు పెరిగి 0.92 శాతం లాభంతో 7,880.70 పాయింట్ల వద్దకు చేరాయి. ఈ సెషన్లో సెన్సెక్స్ 26,116.90 పాయింట్ల గరిష్ఠాన్ని, 25,314.94 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. స్మాల్ కాప్ 1.01 శాతం, మిడ్ కాప్ 1.99 శాతం లాభపడ్డాయి. యస్ బ్యాంక్, టాటా మోటార్స్, వీఈడీఎల్, బీపీసీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా పవర్, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News