: రైతు రుణమాఫీతో తల ప్రాణం తోకకు వస్తోంది: కేటీఆర్


రైతుల రుణమాఫీ ఎంత భారంతో కూడుకున్నదో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదికూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తోంది. నిన్న గవర్నర్ నరసింహన్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కేటీఆర్ కూడా ఆయనతోనే ఉన్నారు. ఈ సందర్భంగా వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేయడం వల్ల తమపై వడ్డీ భారం పడుతోందని ఓ రైతు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని కేటీఆర్ చెప్పినప్పటికీ సదరు రైతు శాంతించలేదు. దీంతో పక్కనే ఉన్న బ్యాంకు మేనేజర్ ను కేటీఆర్ వివరణ కోరారు. అయితే, రెండో విడతలో 25 శాతం నిధులు విడుదల కావాల్సి ఉండగా... అందులో సగమే విడుదలయ్యాయని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. దీంతో, 25 శాతం నిధులు పూర్తిగా విడుదల కాలేదా? అని గవర్నర్ కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంలో మళ్లీ కేటీఆర్ కల్పించుకుని... ప్రభుత్వం వద్ద నిధులుంటే రైతుల రుణాన్ని ఒక్క విడతలోనే మాఫీ చేసేవాళ్లమని చెప్పారు. అంతేకాకుండా, రుణాన్ని మాఫీ చేయడం తలకు మించిన భారంగా మారిందని... తల ప్రాణం తోకకు వస్తోందని అన్నారు. అయితే, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News