: మార్కెట్ పతనంలోనూ భారతీయులందరికీ కలిగే లాభం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్ల నుంచి భారతీయులకు ఓ లాభం కలుగుతోంది. అదేంటో తెలుసా? పెట్రోలు ధరలు తగ్గడం. మార్కెట్లతో అనులోమానుపాతంలో సాగే ముడిచమురు ధరలు తాజా కనిష్ఠాలకు చేరుకున్నాయి. వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 3 శాతం తగ్గి 39 డాలర్లకు దిగిపోయింది. మరోవైపు భారత బాస్కెట్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 24 తగ్గి రూ. 2,615 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ కాంట్రాక్టులో కొనుగోలు చేసే క్రూడాయిల్ వచ్చే నెల 15 తరువాత ఇండియాకు డెలివరీ అవుతుంది. ఆగస్టులో 1వ తేదీన, ఆపై 14న 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గించిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ నెలాఖరులో మరోసారి తగ్గించక తప్పని పరిస్థితి నెలకొందని, ఆపై కూడా పెట్రోలు ధరలు మరింతగా దిగివస్తాయని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పెట్రోలు, డీజెల్, వంటగ్యాస్ తదితరాల ధరలు తగ్గడం ప్రతి భారతీయుడికీ ఆనందం కలిగించే అంశమేగా?