: అందరి చూపు ఢిల్లీ వైపు!... ప్రధానితో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్ర ఆసక్తి
ఏపీతో పాటు తెలంగాణలోని ప్రజల్లో దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. దాదాపు రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఢిల్లీ పరిణామాలపైనే దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. నేటి ఉదయం 10.30 గంటలకు ప్రధానితో భేటీ అవుతారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక ప్యాజేజీ, ప్రత్యేక హోదాతో పాటు భారీగా గ్రాంటు విడుదల చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరనున్నారు. ఈ మేరకు ఏపీ ఉన్నతాధికారులు పకడ్బందీగా నివేదికను రూపొందించారు. బీహార్ కు రూ.1.25 కోట్ల ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీలో ఏపీకి కూడా భారీ ప్యాకేజీ లభించనుందన్న ప్రచారం జరుగుతోంది. భారీ ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదాతోనే చంద్రబాబు తిరిగిరావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, తమకూ ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న వాదన తెలంగాణలో ఇప్పుడిప్పుడే మొదలైంది. ఏపీకి ఇచ్చిన తరహాలోనే కొత్త రాష్ట్రమైన తమకూ ప్యాకేజీ అవసరమేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో చంద్రబాబు భేటీపై తెలంగాణలోనూ ఆసక్తి నెలకొంది.