: స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది?... ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?
చైనా స్టాక్ మార్కెట్ లో ఏర్పడిన సంక్షోభం ప్రపంచమంతా విస్తరించింది. లక్షల కోట్ల రూపాయల మదుపరుల పెట్టుబడులు హరించుకుపోయాయి. వేల పాయింట్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు మదుపరులను ఆందోళనలోకి నెట్టేశాయి. ఈ పరిణామం అకస్మాత్తుగా సంభవించినది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి చైనా 'బేర్' ప్రమాద సంకేతాలను పంపుతోందని వారు వెల్లడిస్తున్నారు. చైనాలో ట్రేడింగ్ ను 'చవుగో' అంటారు. 'చవుగో'లో ఎలాంటి పరిజ్ఞానం లేని వారు పెట్టుబడులు పెడుతుంటారు. చైనాలో ఉత్పాదక రంగం పురోగమనంలో ఉండగా, స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. దీంతో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టారు. చైనాలో సుమారు 15 శాతం మంది ప్రజలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టారంటే స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో దూసుకుపోయిందో ఊహించవచ్చు. ఇదే సమయంలో చైనాలో ఉత్పాదక రంగం మందగించి, తిరోగమనంలో పడింది. దీంతో స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైంది. పెట్టిన పెట్టుబడి తరిగిపోతుందేమోననే భయంతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిపెట్టిన సామాన్య ప్రజానీకం షేర్ల అమ్మకం ప్రారంభించారు. దీంతో షేర్లు మరింత పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా కరెన్సీ విలువను తగ్గించి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. దీంతో షేర్లు మరింత నష్టాన్ని తెస్తాయని భావించిన మదుపరులు మరిన్ని అమ్మకాలకు ముందుకు వచ్చారు. దీంతో చైనా స్టాక్ మార్కెట్లు భారీ స్థాయి పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. లక్షల కోట్ల రూపాయలు కేవలం 24 గంటల్లో హరించుకుపోయాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇలాగే ఉండదని, నిపుణులు అభిప్రాయపడుతుండగా, చైనా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన విదేశీయుల శాతం 1.4 మాత్రమేనని, వీరిపైనే అధిక ప్రభావం ఉంటుందని, ఇతరులపై అంత ప్రభావం ఉండదని వారు పేర్కొంటున్నారు. చైనా స్టాక్ మార్కెట్ కోలుకుని లాభాల బాటపట్టాలని, నేడు మార్కెట్ లో కోల్పోయిన డబ్బు తిరిగి రావాలని మదుపరులు కోరుకుంటున్నారు.