: చంద్రబాబు గారి సమన్యాయమేంటో చెప్పాలి: ఉండవల్లి


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, అసలు సమన్యాయం అంటే ఏమిటి? ఏం చేస్తే సమన్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. ఆ వివరాలు చంద్రబాబు వెల్లడిస్తే దానిని చట్టం చేయమని డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయింది. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తక్షణం 10 వేల కోట్లరూపాయలు విడుదల చేయాలని అడిగితే, అప్పటి కేంద్ర మంత్రి రాష్ట్రం ఏర్పడకుండా ఎలా ఇస్తామని ప్రశ్నించారని, అప్పుడు సరే మేము అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు, తరువాత ముఖం చాటేశారని అన్నారు. తక్షణ సాయంగా కేంద్రం 18 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చంద్రబాబు అడిగితే, విభజన చట్టంలో పొందుపరచినవి మినహా అదనంగా పది పైసలు కూడా విదల్చలేదని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన తరువాత బీజేపీ నేతలు చెబుతూ పదేళ్ల పాటు ట్యాక్సులు ఉండవన్నారు. పరిశ్రమలు వచ్చేందుకు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు సమాన హక్కులన్నారు. దేశం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామన్నారు. కానీ, ఏవీ ఇవ్వకుండా నీతి ఆయోగ్, పద్నాలుగవ ఆర్థిక సంఘం పేరు చెప్పి ఒక్కొక్కటి కత్తిరించుకుంటూ పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు మినహా మిగతావారంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. ప్యాకేజీకి, ప్రత్యేకహోదాకు సంబంధం లేదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా వేరు, ప్యాకేజీ వేరు అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అనేది ట్యాక్స్ లు, ఇతరత్రా అంశాల్లో రాయితీ వెసులుబాటు కల్పిస్తే, ప్యాకేజీ మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News