: కాంగ్రెస్ చేసింది గొంతు కోత...మరి బీజేపీ చేసింది ఏమిటి?: ఉండవల్లి


ఎన్నికల సందర్భంగా ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విభజన సందర్భంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడి ఉండకపోతే తెలుగు ప్రజల భవిష్యత్ ఏమై ఉండేది? అని తెలుగు ప్రజలను అడిగారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. హైదరాబాదు ప్రెస్ క్లబ్బులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తలుపులు మూసేసి లోక్ సభలో పాస్ చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని ఉండవల్లి విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోయడం సాధ్యమయ్యేదా? అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అప్పటి లోక్ సభ సమావేశంలో నేతల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ సందర్భంగా తలుపులు మూసి బిల్ పాస్ చేయడమేంటని అభ్యంతరం చెప్పిన ఓ బీజేపీ నేతను, ఆవేళ ఊరుకొమ్మని చెప్పింది కూడా బీజేపీ నేతలేనని ఆయన గుర్తు చేశారు. అప్పటి సభలో కాంగ్రెస్ తరపున జైపాల్ రెడ్డి, బీజేపీ తరపున సుష్మాస్వరాజ్ మాత్రమే మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో పదేళ్ల స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేసింది మాత్రం వెంకయ్యనాయుడేనని ఆయన గుర్తు చేశారు. అదే సందర్భంలో వెంకయ్యనాయుడుతో సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ, ఉదయం జరిగిన మీటింగ్ లో ఐదేళ్ల ప్రత్యేకహోదాకు ఒప్పుకుని, ఇప్పుడు పదేళ్లు అని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించిన విషయం గుర్తుచేశారు. చివరికి ఐదేళ్ల ప్రత్యేకహోదా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొంతు కోసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని, అంతకంటే పెద్దమోసం బీజేపీ చేసిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News