: మంత్రులు యనమల, రావెలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
ఏపీ మంత్రులు యనమల, రావెల కిషోర్ బాబులపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్టరాల్ 3 వేల ఎకరాల భూమి కోసం ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యానించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్టరాల్ అనే పదం ఎందుకు వాడుతున్నారంటూ ప్రశ్నించారు. కిషోర్ బాబుకు ఆఫ్టరాల్ 3 వేల ఎకరాల భూమే కావచ్చు... పేద రైతులకు అదే సర్వస్వం, అదే జీవితం అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడుపై కూడా పవన్ విమర్శలు గుప్పించారు. 'ప్రజల గురించి ఆలోచించండి సార్' అంటూ తాను ఎంతో సంస్కారంగా అడిగితే... రాజధాని నిర్మాణం ఎలా చేయాలో పవన్ కల్యాణే చెప్పాలంటూ యనమల చాలా వెటకారంగా మాట్లాడారని... ప్రజల బాధల గురించి తాను మాట్లాడుతుంటే యనమలకు వెటకారంగా ఉందా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పెనుమాకలో రైతులతో భేటీ అయిన సందర్భంగా, పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అక్కడున్న రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది.