: నాకు కులం అంటగట్టొద్దు... బలవంతంగా భూమి లాక్కుంటే అడ్డుపడతా: పవన్ కల్యాణ్
గతంలో తాను రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉండేందుకు ఇక్కడకు వచ్చినప్పడు ఓ ప్రతిక వీకెండ్ న్యూస్ అంటూ రాసిన కథనంలో తనపై ఒక స్టోరీ రాసిందని... అందులో తన కులానికి చెందిన వారే తన చుట్టూ ఉన్నారని రాసిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కులం, మతం లేదని... కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ రాజధానిపైనే ఉందా? అనే ఆలోచన వచ్చే అవకాశం ఉందని పవన్ అన్నారు. ఎంతసేపూ రాజధాని గురించే ఆలోచిస్తే... మిగిలిన ప్రాంతాలు అన్యాయం అవుతాయని... అప్పుడు బ్యాలెన్స్ దెబ్బతింటుందని... ఏపీ మరో తెలంగాణలా తయారవుతుందని చెప్పారు. హుదూద్ తుపాను వచ్చినప్పుడు అండగా నిలబడి రూ. 50 లక్షలు విరాళం ఇస్తే శభాష్ అన్నవారు... ఇప్పుడు బలవంతపు భూసేకరణ వద్దంటే మాత్రం అభివృద్ధి నిరోధకుడిని అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే... టీడీపీని నమ్మి ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏమిటని నిలదీశారు.