: అండగా ఉండటానికే వచ్చా... పారిపోవడానికి కాదు: పవన్ కల్యాణ్
గుంటూరు జిల్లా పెనుమాక రైతులతో భేటీ అయిన పవన్ కల్యాణ్ వారి సాధకబాధకాలను ఆసాంతం విన్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, రైతులకు అండగా ఉండటానికే ఇక్కడకు వచ్చానని... పారిపోవడానికి కాదని చెప్పారు. చాలా మంది తన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటారని... కానీ, తాను అలాంటి వాడిని కాదని... తనకు ఎలాంటి భయం లేదని తెలిపారు. టీడీపీతో గొడవ పెట్టుకోవడానికి తాను ఇక్కడకు రాలేదని అన్నారు. కొన్ని ప్రత్యేక కారణాలతోనే తాను బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రం కనుకే మద్దతు ఇచ్చానని చెప్పారు. పరిపాలన వ్యవస్థలోనే లోపముందని... భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని అన్నారు. వైకాపా నేతలపై కూడా తనకు ఎలాంటి ద్వేషం లేదని పవన్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని... తాను కూడా రైతునే అని... చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు.