: ఏడాది పొడవునా ‘మల్లె’లిచ్చే భూమిని వదులుకునేదెలా?... పెనుమాక రైతు ఆవేదన
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అంటూ లేని ఏపీకి నూతన రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు నవ్యాంధ్ర రాజధాని రైతుల్లో 95 శాతనికి పైగా రైతులు సంతోషంగానే ఒప్పుకున్నారు. అయితే కొద్ది శాతం మంది రైతులు మాత్రం తమకు జీవనోపాధిగా ఉన్న భూములను వదులుకుంటే తమ బతుకులెలా సాగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా రైతుల తరఫున పోరు సాగించేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. మరికొద్దిసేపట్లో పెనుమాకకు వస్తున్న పవన్ కల్యాణ్ కోసం ఈ కోవకు చెందిన రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెనుమాకలో పవన్ కల్యాణ్ సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ తెలుగు టీవీ చానెల్ తో మట్లాడిన చిరు రైతు చేసిన వాదన అక్కడున్న వారిని ఆలోచనలో పడేసింది. తనకున్న 40 సెంట్ల భూమిలో మల్లెపూలను సాగు చేస్తున్నానన్న ఆ రైతు, ఏడాది పొడవునా తన పొలంలో మల్లెలు విరగకాస్తాయని చెప్పారు. ఈ పూల తోటే తన కుటుంబానికి జీవనాధారమని ఆయన పేర్కొన్నారు. తన తోటలో మల్లెల కోతకు వచ్చే కూలీలకు రోజుకు రూ.70 కూలీ ఇస్తున్నానన్నారు. ఆ కూలీతోనే తన పొలంలో పనిచేసే కూలీలంతా ఏడాది పొడవునా పని కొరతన్నదే లేకుండా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి పోతే తన కుటుంబంతో పాటు దానిపై ఆధారపడ్డ కూలీలకు జీవనాధారం పోయినట్లేనని ఆయన తెలిపారు. తమను పవన్ కల్యాణే ఆదుకోవాలన్నారు. అధికారుల ఒత్తిడి నుంచి పవన్ కల్యాణ్ తమకు ఉపశమనం కలిగిస్తారన్న విశ్వాసం కూడా ఉందని ఆ రైతు ధీమా వ్యక్తం చేశారు.