: ఏపీ సీఎంఓలో రాజమౌళి!


టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ నేపథ్యంలో రాజమౌళి పేరు వినిపిస్తే, జనమంతా అటే చూస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ‘‘హలో రాజమౌళి గారూ... నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా’’ అంటూ ఓ గ్రామ కమిటీ సభ్యుడికి ఫోన్ చేశారు. ఈ వార్త అన్ని పత్రికల పతాక శీర్షికల్లో ప్రముఖ స్థానం సంపాదించింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యాలయంలో రాజమౌళి అడుగుపెడుతున్నారన్న వార్త కూడా నేటి వార్తా పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమైంది. అసలీ రాజమౌళి ఎవరు? ‘బాహుబలి’ ఎస్ఎస్ రాజమౌళే కదా? అంటూ అంతా ఆసక్తిగా చూశారు. అయితే ఈ రాజమౌళి ఐఏఎస్ అధికారి అని తెలిసి కాస్తంత నిరాశ చెందారు. సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సీఎం కార్యాలయంలో అడుగుపెడుతున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే వారి నిరాశ స్థానంలో ఆసక్తి నెలకొంది. కృష్ణా జిల్లాకు చెందిన అడుసుమిల్లి రాజమౌళి ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. చాలాకాలంగా యూపీలోనే పనిచేసిన ఆయన ఇటీవల సొంత రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు. రాజమౌళిని చంద్రబాబు తన కార్యదర్శుల్లో ఒకరిగా నియమించుకునేందుకు ఇప్పటికే నిర్ణయం కూడా తీసేసుకున్నారట.

  • Loading...

More Telugu News