: గొర్రెల మందను తప్పించే క్రమంలో బోల్తా పడిన కరెన్సీ కంటెయినర్
తమిళనాడులోని నాగర్ కోయిల్ వద్ద ఓ కరెన్సీ కంటెయినర్ బోల్తా పడింది. మైసూర్ లోని మింట్ కాంపౌండ్ నుంచి కరెన్సీని కేరళలోని తిరువనంతపురం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగర్ కోయిల్ సమీపంలోని సదయంకుళం వద్ద కంటెయినర్ కు ఓ గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. ఆ మందను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో, కంటెయినర్ అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. అయితే, అందులో ఉన్న కరెన్సీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆ కరెన్సీని వాటర్ ప్రూఫ్ తరహాలో ప్యాక్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో మూడు గొర్రెలు ప్రాణాలు విడిచాయి. కంటెయినర్ డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తిరువనంతపురం రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంటెయినర్ ను క్రేన్ సాయంతో రోడ్డుపై నిలిపారు. ఈ కంటెయినర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రతతో మైసూర్ నుంచి కేరళ బయల్దేరగా శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.