: ములాయంకు సమన్లు... తీవ్ర వ్యాఖ్యల పర్యవసానం
ఓ మహిళపై నలుగురు అత్యాచారం చేయడం సాధ్యమేనా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల ఆగ్రహానికి గురైన సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ములాయం వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ లోని కుల్పహాద్ తెహ్సీల్ జూనియర్ సివిల్ జడ్జ్ అంకిత్ గోయల్ సుమోటోగా స్వీకరించి సమన్లు జారీ చేశారు. ఓ వ్యక్తి రేప్ చేస్తే, బాధితురాలు అతని కుటుంబంలోని ఇతరుల పేర్లు కూడా చెబుతుందని, తద్వారా అదో సామూహిక అత్యాచార ఘటనగా తెరపైకి వస్తుందని ములాయం వ్యాఖ్యానించారు. ములాయం వ్యాఖ్యలతో రాష్ట్రంలో మహిళా సంఘాల నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ములాయంకు మహిళలంటే గౌరవంలేదని మండిపడ్డారు.