: వరుసగా ఎనిమిదో వారంలోనూ పతనం, ఆరున్నరేళ్ల కనిష్ఠానికి ముడి చమురు ధరలు
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరల పతనం కొనసాగింది. చైనాలో ఉత్పత్తి రంగం గణాంకాలు దిగజారాయన్న విశ్లేషణలతో 1986 తరువాత అతిపెద్ద వారాంతపు పతనం దిశగా క్రూడాయిల్ ధరలు సాగాయి. దాదాపు 29 సంవత్సరాల తరువాత క్రూడాయిల్ ధరలు వరుసగా 8వ వారంలోనూ పతనమయ్యాయి. శుక్రవారం నాటి సెషన్లో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 59 సెంట్లు తగ్గి 40.73 డాలర్లకు (అక్టోబర్ లో డెలివరీ) చేరింది. ఇది ఆరున్నరేళ్ల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర వరుసగా ఏడవ వారంలోనూ పతనమవుతూ బ్యారల్ కు 46.06 డాలర్లకు చేరింది. అమెరికాలో సరికొత్త క్రూడాయిల్ నిల్వలు బయట పడ్డాయన్న వార్తలు ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.