: వచ్చే నెలాఖరులోగా గుంటూరుకు వ్యవసాయ శాఖ: ఏపీ మంత్రి ప్రత్తిపాటి
ఏపీ పాలన క్రమంగా నవ్యాంధ్ర రాజధానికి తరలిపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పాలన హైదరాబాదు నుంచే కొనసాగుతోంది. ఈ క్రమంలో కాస్త వేగంగా చర్యలు చేపట్టిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేయడమే కాక నూతన రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేశారు. ప్రస్తుతం భూసేకరణ పూర్తి కావస్తోంది. త్వరలోనే నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు దాదాపు వారానికి ఐదు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఇక చంద్రబాబు కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కూడా నవ్యాంధ్ర బాట పట్టారు. గుంటూరులో కొద్దిసేపటి క్రితం ఆయన మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలాఖరులోగా తన పరిధిలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలన్నిటినీ గుంటూరుకు తరలించనున్నామని చెప్పారు. గుంటూరు నుంచే తాను తన శాఖను పర్యవేక్షిస్తానని ఆయన ప్రకటించారు. వచ్చే నెలాఖరు నుంచి తన శాఖ గుంటూరు నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.