: 90 శాతం మంది ముస్లిం మహిళలకు ఇష్టం లేకున్నా...!
నోటితో 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు మంజూరు కావడం 90 శాతం మంది మహిళలకు ఇష్టం లేదట. దీంతో పాటు తన భర్త, మతం అంగీకరిస్తుందని చెబుతూ, మరో మహిళను వివాహం చేసుకోవడం కూడా నచ్చడం లేదని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బీఎంఎంఏ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మూడు సార్లు 'తలాక్' అంటే విడాకులు మంజూరు కావడాన్ని 92.1 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా 4,710 మందిని ప్రశ్నిస్తే, అందులో 4,320 మంది భర్త రెండో వివాహానికి తాము వ్యతిరేకమని చెప్పారట. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు సహా 10 రాష్ట్రాల్లో సర్వే జరిపినట్టు బీఎంఎంఏ వెల్లడించింది. స్కైపే, వాట్స్ యాప్, సెల్ ఫోన్ మెసేజ్ లలో మూడు సార్లు 'తలాక్' చెప్పడం ద్వారా ముస్లింలు విడాకులు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ సర్వే వివరాలు వెలుగులోకి రావడం గమనార్హం. ముస్లిం కుటుంబ చట్టాలను మార్చాలని, తమకు న్యాయం జరిగేలా నిబంధనలు పొందుపరచాలని 83.3 శాతం మంది మహిళలు కోరుకుంటున్నారు.