: మంత్రి యనమలకు కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్
భూసేకరణ చేయకుండా రాజధాని నిర్మించడానికి అదేమీ త్రిశంకు స్వర్గం కాదని... తామేమీ విశ్వామిత్రులం కాదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తనపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ముందు కట్టేది స్వర్గమని తెలిస్తే... అది త్రిశంకు స్వర్గమా? లేక రెగ్యులర్ స్వర్గమా? అనేది తర్వాత ఆలోచించవచ్చని అన్నారు. హైదరాబాదులో సినీ పరిశ్రమకు ఇచ్చిన భూములు బహుళ పంటలు పండే భూములు కావని... కొండలు, గుట్టలు మాత్రమే అని చురక అంటించారు. 'ఈ విషయం యనమల గారికి తెలియదనుకుంటా' అని సెటైర్ విసిరారు. హైదరాబాద్ కొండల్లో, విశాఖ కొండల్లో తనకు స్టూడియోలు లేవని అన్నారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే... వాటిపై విజ్ఞతతో స్పందించడం మానేసి, రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే బేతపూడి, పెనుమాక, ఉండవల్లి తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తాను.