: నాలుగు దశాబ్దాల తర్వాత 'ఐపీఎస్'కి స్పెషల్ రిక్రూట్ మెంట్... ఐపీఎస్ అధికారుల కొరతే కారణం!
అప్పుడెప్పుడో 1970 దశకంలో దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం కోసం స్పెషల్ రిక్రూట్ మెంట్ జరిగింది. అప్పుడు సివిల్ సర్వెంట్ల సంఖ్యలో భారీ కొరత ఏర్పడ్డ కారణంగా భారత సైన్యంలో పనిచేస్తూ తగిన విద్యార్హతలున్న వారిని ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన స్వరణ్ జిత్ సేన్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన ఏవీఎస్ రెడ్డిలు ఈ తరహా నియామకం ద్వారానే సివిల్ సర్వీసుల్లోకి వచ్చారట. ఆ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తలేదు. అయితే ప్రస్తుతం దేశంలో ఐపీఎస్ అధికారుల విషయానికొస్తే, పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా 4,728 మంది ఐపీఎస్ అధికారులుండాల్సి ఉండగా, 3,798 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే ఇంకా 930 మంది ఐపీఎస్ అధికారుల అవసరముంది. అయితే ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేటగిరీల కింద కేవలం 500 నుంచి 800 మంది అధికారులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఐపీఎస్ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం 1970 దశకంలో నిర్వహించిన మాదిరిగా ‘ఇండియన్ పోలీస్ సర్వీస్ లిమిటెడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‘ పేరిట స్పెషల్ రిక్రూట్ మెంట్ చేపట్టాలని యోచిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ లో గతంలో మాదిరిగా కేవలం సైనికాధికారులకు మాత్రమే అవకాశాలను పరిమితం చేయకుండా స్టేట్ పోలీస్ సర్వీస్, పారా మిలిటరీ బలగాలకు కూడా అవకాశం కల్పించాలని కసరత్తు చేస్తోంది. స్పెషల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేంద్రం, ఈ రిక్రూట్ మెంట్ బాధ్యతలను కూడా యూపీఎస్సీకే అప్పగించనుంది. ఈ తరహా రిక్రూట్ మెంట్ కింద ఏటా 70 మంది ఐపీఎస్ లను నియమించుకోవాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.