: రాజ్ థాకరే భార్య షర్మిలపై 'బాండ్' దాడికి కారణమిదే!
చూడక చేసిన చిన్న తప్పు రాజ్ థాకరే భార్య షర్మిలను ఆసుపత్రి పాలు చేసింది. కన్నబిడ్డలా పెంచుకుంటున్న శునకం 'బాండ్' నిన్న షర్మిలపై దాడి చేయగా, ఆమె ముఖంపై తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఇంట్లో పడుకొని ఉన్న పెంపుడు కుక్క 'బాండ్'పై, అటుగా వెళ్తున్న షర్మిల పొరపాటున కాలు వేసిందట. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా ఆ కుక్క ఆమె ముఖంపై దాడి చేసింది. పొడవుగా, బలంగా ఉన్న ఆ కుక్క ఒక్కసారిగా లేవడంతో ఆమె ముఖం దానికి చిక్కింది. దాని పళ్లు పదునుగా ఉండటం, దవడ ఎముకల వరకూ పళ్లు దిగడంతో షర్మిలకు 65 కుట్లు వేయాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరున్న ప్లాస్టిక్ సర్జన్ అనిల్ తిబరేవాలా పర్యవేక్షణలో ఉన్నారు. కుక్క కాట్లు కనిపించకుండా చూసేందుకు ఆమెకు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. కాగా, రాజ్ థాకరే ఇంట్లో ఉన్న మూడు 'గ్రేట్ డేన్' జాతికి చెందిన శునకాలు జేమ్స్, బాండ్, షాన్ లను ఫాంహౌస్ కు పంపినట్టు తెలుస్తోంది.