: 60 మంది మరణానికి కారకులైన వారికి రూ. 60 కోట్ల జరిమానానా? ... సుప్రీం తీర్పుపై బాధితుల అసంతృప్తి!


ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్ లో జరిగిన ఘోర దుర్ఘటనలో నిందితులుగా ఉన్న ప్రముఖ బిల్డర్లు గోపాల్, సుశీల్ అన్సాల్ లకు రూ. 60 కోట్ల జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. 1997లో సినిమా హాల్ లో 'బార్డర్' చిత్ర ప్రదర్శన సమయంలో జరిగిన అగ్నిప్రమాదం 60 మందిని సజీవ దహనం చేసిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఈ సినిమా హాల్ లో విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలకు సంబంధించి ఏ నిబంధననూ పాటించలేదని విచారణ అధికారులు తేల్చగా, అది బిల్డర్ల తప్పిదమేనని అభిప్రాయపడ్డ కోర్టు వారికి జరిమానా విధించింది. అయితే, వీరికి పడ్డ శిక్ష సరిపోదని మృతుల బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో తన కుమారుడు, కుమార్తెను కోల్పోయిన కృష్ణమూర్తి స్పందిస్తూ, "నాకు చాలా కోపంగా, అసంతృప్తిగా ఉంది. తీర్పు ఎంతమాత్రమూ న్యాయం చేసేట్టుగా లేదు. వారు కావాలనే అలసత్వాన్ని ప్రదర్శించారని చెప్పిన న్యాయమూర్తులు వేసే శిక్ష ఇదా?" అని ప్రశ్నించారు. కాగా, విచారణ దీర్ఘకాలం సాగిందన్న కారణంతోనే నిందితులకు జరిమానాతో సరిపెట్టి ఉండవచ్చని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News