: 'స్వాతి చినుకులు' సీరియల్ హీరో బాజీ అరెస్ట్
సూపర్ హిట్ బుల్లితెర సీరియల్ 'స్వాతి చినుకులు' హీరో బాజీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదులు రాగా, సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ కు హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసుల సహకారం కోరిన విజయవాడ పోలీసులు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద జరుగుతున్న షూటింగ్ వద్దకు వచ్చి అరెస్ట్ చేశారు. కాగా, బాజీ భార్య సోమ, ఇటీవల తన భర్త వేధిస్తున్నాడని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 380, 406 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన బాజీ, 'ఆడదే ఆధారం' సీరియల్ లోనూ ప్రధాన పాత్ర పోషించారు.