: చనిపోయిన తండ్రితో వాదించాలంటూ సమాధిని తవ్వబోయాడు!


అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్టాన్ ఫోర్డ్ నగరంలో మైఖేల్ డేల్ మే (44) అనే వ్యక్తి తన తండ్రి సమాధిని తవ్వేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఎందుకలా చేయాలనుకున్నావని ప్రశ్నిస్తే... తన తండ్రితో వాదించాలని బదులిచ్చాడా వ్యక్తి. దాంతో, పోలీసులు విస్తుపోయారు. చనిపోయిన వ్యక్తితో వాదనలేంటి? అంటూ మైఖేల్ డేల్ ను ఎగాదిగా చూశారు. ఆ సమయంలో అతడు మద్యపానం చేసివున్నట్టు గుర్తించారు. అతడి తండ్రి 30 ఏళ్ల క్రితం మరణించాడని గుర్తించారు. కాగా, పైలట్ బాప్టిస్ట్ చర్చ్ శ్మశానవాటిక వర్గాలు మే అనే పేరున్న 13 మంది వ్యక్తులు సమాధి చేయబడ్డారని, మైఖేల్ డేల్ తవ్వేందుకు ప్రయత్నించిన సమాధి అతడి తండ్రిదో, కాదో తెలియదని పేర్కొన్నాయి. అయితే, 1983 నవంబర్ 23న విల్లిస్ గ్రీన్ మే అనే వ్యక్తిని సమాధి చేశారని, అయితే, ఆ వ్యక్తి మైఖేల్ డేల్ తండ్రేనన్న విషయంపై స్పష్టత లేదన్నాయి. 2002లో యూజీన్ మే అనే వ్యక్తిని సమాధి చేశారని శ్మశాన వాటిక రిజిస్టర్ ద్వారా తెలిసింది. ఇక, మైఖేల్ డేల్ మే ను అరెస్టు చేసిన పోలీసులు శ్మశానంలో తవ్వకాలు చేపట్టడం, తాగి బహిరంగంగా చిందులేయడం, మారిజువానా కలిగివుండడం వంటి అభియోగాలను అతడిపై మోపారు లింకన్ కౌంటీ పోలీసులు.

  • Loading...

More Telugu News