: రూ. 325 కోట్లు, 8 విమానాశ్రయాలు... రాత్రయితే 'దయ్యాల కోట'లే!
జైసల్మేర్... రాజస్థాన్ లోని ఎడారి నగరం. ఇక్కడ 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 111 కోట్లు) పెట్టి రెండేళ్ల క్రితం అత్యాధునిక విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయం సాలీనా 3 లక్షల మంది ప్రయాణ అవసరాలు తీర్చేలా, 180 సీట్లుండే మూడు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించారు. ఇప్పుడది ఖాళీగా ఉంది. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా ప్రయాణించడం లేదు. జైసల్మేర్ ఒక్కటే కాదు. 2009 నుంచి ఇండియా సుమారు రూ. 326 కోట్లతో మరో 7 చిన్న విమానాశ్రయాలను నిర్మించింది. వీటిల్లో ఒక్క ఎయిర్ పోర్టుకూ సర్వీసులు తిరగట్లేదు. "ఒక విమానాశ్రయాన్ని నిర్మించినంత మాత్రాన మౌలిక వసతులు కల్పించేశాం. అభివృద్ధి చెందామని భావించరాదు. వాస్తవ పరిస్థితులను గుర్తెరగాలి" అని స్పైస్ జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరం తాము కొత్తగా నిర్మించిన మైసూరుకు సేవలను ప్రారంభించినా, ప్రజల నుంచి ఎంతమాత్రమూ డిమాండ్ రాకపోవడంతో వెనక్కు తగ్గామని వివరించారు. యూపీఏ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు 200 చిన్న విమానాశ్రయాలు నిర్మించాలన్న లక్ష్యంతో మొదలెట్టినవే ఇవన్నీ. ఈ ఎయిర్ పోర్టుల్లో ఖాళీగా కనిపించే చెకిన్ డెస్క్ లు, దుమ్ముపట్టిన సీట్లు రాత్రి అయితే, లైట్లు వెలగక 'దయ్యాల కోట'ల్లా కనిపిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని 100కు పైగా విమానాశ్రయాల్లో ఈ సంవత్సరం ఒక్క విమానం కూడా దిగలేదు. వీటిల్లో కొన్నింటిని కేవలం చార్టెడ్ విమానాల కోసమే నిర్మించినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఇటీవలి మోదీ ప్రసంగం విమానాశ్రయాల విషయంలో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. బీహార్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ, ఆ రాష్ట్రంలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని, అందుకోసం రూ. 2,700 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఉన్న విమానాశ్రయాలనే వాడుకోలేకపోతున్న ఈ తరుణంలో కొత్తగా మరో నాలుగు కట్టిస్తామన్న మోదీ హామీపై విమర్శలు వస్తున్నాయి.