: పచ్చి నిజం... ఎవరిస్తున్నారో తెలీకుండానే రాజకీయ పార్టీల వద్ద కోట్లకు కోట్లు!


ఇండియాలోని రాజకీయ పార్టీల వద్దకు విరాళాల రూపంలో కోట్లకు కోట్లు వస్తున్నాయి. కానీ, వీటిని ఎవరు పంపిస్తారో మాత్రం ఏ పార్టీకీ తెలియదట. 2013-14లో భారత పొలిటికల్ పార్టీలకు అందిన డబ్బులో రూ. 673 కోట్లు అంటే, మొత్తంలో 79.68 శాతం ఊరు, పేరు లేనివారి నుంచి వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కలు 2014లో పార్లమెంటు ఎన్నికలకు ముందువి. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) నిర్వహించిన అధ్యయనం తరువాత ఈ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అన్ని ఎన్నికల పార్టీలు తమ ఆదాయ, వ్యయ వివరాలు వెల్లడించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఐదు జాతీయ పార్టీలు తమ వద్ద ఉన్న డబ్బు వివరాలు వెల్లడించాయి. బీఎస్పీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఎన్సీపీ, కాంగ్రెస్ లు తమ దస్త్రాలను ఈసీకి పంపాయి. బీజేపీ ఇంకా ఏ విధమైన లెక్కలనూ వెల్లడించలేదు. ఈసీ గతంలోనే ఒత్తిడి చేయగా, ఈ సంవత్సరం జూలై 9 వరకూ సమయం కోరిన బీజేపీ, అది ముగిసిన తరవాత కూడా ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించ లేదు. కాగా, 2013-14లో మొత్తం 844 కోట్లను దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు సేకరించాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ రూ. 598 కోట్లు సేకరించగా, సీపీఐ (ఎం) 121.87 కోట్లు సేకరించింది. రూ. 20 వేల కన్నా ఎక్కువ విరాళాలు ఇచ్చిన వారి వివరాలను పార్టీల వెబ్ సైట్లలో తప్పనిసరిగా ప్రచురించాలన్న నిబంధన ఉన్నా, దాన్ని ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. కూపన్లు (సభ్యత్వం, ప్రత్యేక సమావేశాలకు ఆహ్వానం తదితరాలు) అమ్మకం ద్వారా, స్వచ్ఛందంగా వచ్చిన విరాళాలు, పార్టీకి దానాలు తదితరాలే పార్టీలకు వచ్చే నిధుల్లో అత్యధికం.

  • Loading...

More Telugu News