: సభ్య సమాజం తల దించుకునే తీర్పు... ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపిన 'పెద్ద'ల నిర్ణయం
ఉత్తరప్రదేశ్ లో ఖాప్ పంచాయతీ తీర్పులు విస్తు గొలిపేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఉంటాయి. ఇలాంటి తీర్పు ఒకటి ఇప్పుడు తాజాగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, భాగ్ పట్ జిల్లాలోని ఓ గ్రామంలో జాట్ కులానికి చెందిన అమ్మాయి, దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. కానీ, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక... తమ కులానికే చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని, అత్తారింటికి వెళ్లిపోయింది. అయితే, ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండలేక, భర్తతో కాపురం చేయలేక సతమతమైన ఆమె... చివరకు నెల రోజుల తర్వాత తన ప్రేమికుడు రవి దగ్గరకు వచ్చేసింది. అంతే, యువతి తరపు బంధువులు, గ్రామ పెద్దలు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. బెదిరింపులకు దిగారు. దీంతో, భయపడిపోయిన ఈ ప్రేమికుల జంట పోలీసుల ముందు లొంగిపోయింది. అయితే, తమ పలుకుబడి ఉపయోగించిన యువతి తరపు పెద్దలు రవిపై అక్రమ కేసులను బనాయించి, అరెస్ట్ చేయించారు. అయినా వారిలో ఆగ్రహం చల్లారలేదు. రవి సోదరి మీనా, ఆమె స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని గ్రామస్తులకు ఆజ్ఞాపించారు. అనంతరం, ముఖానికి నల్లరంగు పూసి నగ్నంగా ఊరేగించాలని ఖాప్ పంచాయతీలో తీర్పు చెప్పారు. అంతేకాదు, రవి కుటుంబం ఉంటున్న ఇంటిని ఆక్రమించుకుని... ఊరు వదిలి పెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో, రవి కుటుంబం ఢిల్లీ పారిపోయింది. ఈ నేపథ్యంలో, రవి సోదరి మీనా తమకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమపై జరిగిన రాక్షస క్రీడను, తన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసును విచారించిన జస్టిస్ చలమేశ్వర్ సమగ్ర విచారణ జరిపి, రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని యూపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.