: ఈ 'హిందీ' గోలేంటి?... మోదీపై విమర్శల వెల్లువ!


ఇండియాలో హిందీ భాషను మాట్లాడేవారు కేవలం 25 శాతం మంది మాత్రమే ఉంటే, ప్రధానిగా ఉన్న వ్యక్తి కేవలం వారిని ఉద్దేశించి మాత్రమే ప్రసంగాలు సాగిస్తున్నారని నరేంద్ర మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటపై ఆయన చేసిన ప్రసంగం పట్ల పీఎల్ఈ (ప్రమోట్ లింగ్విస్టిక్ ఈక్వాలిటీ) గ్రూప్ లోని బ్లాగర్లు, టెక్కీలు తదితర నిపుణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. "దేశంలో హిందీ మాట్లాడేవారు కేవలం పావు వంతు మాత్రమే ఉన్నారు. కేవలం వారి కోసమే ప్రధాని ఎందుకు మాట్లాడుతున్నారు?" అని పీఎల్ఈ సభ్యుడు వల్లీష్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ఈ తరహా విమర్శలు వస్తున్నాయి. స్థానిక భాషలను విస్మరిస్తున్నారని, కీలకమైన బోర్డుల్లో సైతం ఇంగ్లీష్, హిందీలను మాత్రమే వాడుతున్నారని వీరు అంటున్నారు. కర్ణాటకలో రైల్వే టికెట్లు సైతం ఇంగ్లీష్, హిందీలో ఉంటున్నాయని, కన్నడంలో లేవని, బెంగళూరు నుంచి మైసూరుకు తీసుకున్న టికెట్ల విషయంలో సైతం పరిస్థితి ఇలాగే ఉందని ఆ రాష్ట్రానికి చెందిన అరుణ్ జవగల్ వాపోయారు. హిందీకి ప్రత్యామ్నాయంగా ఇంగ్లీషును తీసుకోలేమని, ఇంగ్లీషు మాట్లాడేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోందని ప్రముఖ విద్యావేత్త విభా పార్ధసారధి అభిప్రాయపడ్డారు. "బాలీవుడ్ సినిమాలను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. "ప్రధాని ప్రసంగం ఏ కొద్ది మందికి అర్థం కాకపోయినా దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే" అని ఢిల్లీ యూనివర్శిటీ హిందీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అన్నారు. దీన్ని అధికారులు గమనించి, ప్రధాని ప్రసంగాన్ని అన్ని భాషల్లోకి ఎందుకు అనువదించరని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News