: చొక్కా విప్పడం గంగూలీకే సరి... ఇతరులకు నప్పదులే!: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పై మమత వ్యంగ్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అదిర్ రంజన్ చౌదరిపై వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలు ఎక్కువయ్యాయంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బెహరాంపూర్ జిల్లా ముర్షీదాబాదులో అదిర్ రంజన్ చౌదరి చొక్కా విప్పి నిరసన తెలిపారు. దమ్ముంటే తనను కాల్చాలని పోలీసులకు సవాల్ విసిరారు. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. చొక్కా విప్పడం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి సరిపోతుందని, ఇతరులకు కాదని అదిర్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. "రాష్ట్రంలో బంద్ లను అనుమతించడంలేదు. కొందరు వ్యక్తులు మీడియాలో కనిపించడం కోసం చొక్కాలు విప్పుకుంటున్నారు. అయితే, వాళ్లు ఓ విషయం అర్థం చేసుకోవాలి. చొక్కా విప్పడం ఒక్క సౌరవ్ గంగూలీకే సరిపోతుంది, ఇతరులకు నప్పదు" అని చురక అంటించారు.