: "ఆ విషయంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకోండి!"... శ్రేణులకు లాడెన్ ఇచ్చిన పిలుపు ఇది
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను స్థాపించి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. అహింసా సిద్ధాంతమే ఆయుధంగా బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి మహాత్మాగాంధీ. దాన్నిబట్టి... ఇద్దరూ పరస్పర వైరుధ్య భావాలున్న వ్యక్తులని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే, కరుడుగట్టిన ఉగ్రవాది అనదగ్గ లాడెన్, ఓ దశలో, గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని అల్ ఖైదా శ్రేణులకు పిలుపునివ్వడం విస్మయం కలిగించే విషయమే. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుతో ప్రజల్లో ఎంతో ఉత్తేజం రగిల్చాడని, మనం కూడా అలాగే అమెరికా వస్తువులను బహిష్కరిద్దామని లాడెన్ క్యాడర్ కు, మద్దతుదారులకు సూచించాడట. 1993లో ఓ ప్రసంగంలో పైవిధంగా పేర్కొన్నాడట. దానికి సంబంధించిన ఆడియో టేపులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. 2001లో ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సేనలు ప్రవేశించాక, లాడెన్ మారుమూల ప్రాంతాలకు పారిపోయాడు. ఆ సమయంలో అతని స్థావరంలో ఎన్నో క్యాసెట్లు లభ్యమయ్యాయి. గాంధీ ప్రస్తావన ఉన్న టేపులు కూడా వాటిలో ఉన్నాయి. "రవి అస్తమించని సామ్రాజ్యం అని పేరున్న బ్రిటన్ నే తీసుకోండి! బ్రిటీష్ వారు తయారుచేసిన వస్తువులను బహిష్కరించాలని మహాత్మాగాంధీ ప్రకటించిన దరిమిలా, అతిపెద్ద వలస రాజ్యాల్లో ఒకదాని నుంచి బ్రిటన్ వెనక్కి మరలక తప్పలేదు. ఇప్పుడు మనం కూడా అమెరికా విషయంలో అదే చేద్దాం" అని పిలుపునిచ్చాడు.