: నా కల చెదిరిపోయింది: లంక ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజపక్స
అధికారికంగా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే, శ్రీలంక మాజీ అధ్యక్షుడు, మరోసారి పదవిలోకి రావాలని గంపెడాశతో ఉన్న మహీంద రాజపక్స ఓటమిని అంగీకరించారు. అధ్యక్ష పదవి పోతే పోయింది, ప్రధానిగా నైనా సేవలందించాలన్న తన కలలు చెదిరిపోయాయని ఆయన అన్నారు. రాజపక్స నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్ పార్టీని, ప్రధాని రనిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ ఓడించింది. ఓ యుద్ధంలో బాగా పోరాడి తాము ఓడిపోయామని రాజపక్స వ్యాఖ్యానించారు. మొత్తం 22 జిల్లాలుండగా, తాము 8 చోట్ల మాత్రమే విజయం సాధించామని తెలిపారు. కాగా, అధ్యక్ష పదవిని కోల్పోయిన ఏడు నెలల తరవాత ఆయన ప్రధాని పీఠంపై కూర్చోవాలని చేసిన ఆలోచనలనూ ప్రజలు తిప్పికొట్టారు. కాగా, లంక చరిత్రలో అత్యంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు ఇవేనని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వ్యాఖ్యానించారు.