: సంగక్కరపై భార్యదే పైచేయట!


శ్రీలంక క్రికెట్ కు మూలస్తంభంలా నిలబడి, విశేష సేవలందించిన దిగ్గజం కుమార్ సంగక్కర వీడ్కోలు వేళ అందరిలోనూ విచారం నెలకొంది. ఏళ్ల తరబడి క్రికెట్ ప్రపంచాన్ని తనదైన ఆట, వ్యక్తిత్వంతో అలరించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ టీమిండియాతో రెండో టెస్టు అనంతరం మైదానంలో మరిక కనిపించడన్న వాస్తవాన్ని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. అది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణం ఏంటంటే... కుటుంబం. ఓ క్రికెటర్ రాణింపు వెనుక కోచ్ లు, తోటి ఆటగాళ్లు, బోర్డు అండదండలతో పాటు కుటుంబం పాత్ర కూడా విస్మరించరానిది. సంగా విషయంలోనూ అంతే. అయితే, ఈ లంకేయుడి రిటైర్మెంటుపై కుటుంబపరంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ నుంచి తప్పుకోవడం బాధాకరమంటూనే, కుటుంబం కోసం సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని సంగా భార్య యెహాలి తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... "15 ఏళ్లుగా దేశం కోసమే ఆడాడు. అతని అద్భుతమైన కెరీర్ పట్ల ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాను. ఇది సరైన సమయంలో ముగింపుగా భావిస్తున్నాను. ఎందుకంటే, ఏ కొద్దిమందో అత్యున్నత దశలో ఉన్నప్పుడే రిటైర్ అవుతారు. అది గౌరవప్రదం కూడా. వ్యక్తిత్వం విషయానికొస్తే సంగా ఎంతో మానసిక పరిపక్వత ఉన్నవాడు. క్రికెట్ గురించే కాదు, ఇతర అంశాలను సైతం ప్రతి కోణం నుంచి ఆలోచిస్తాడు. ఎంతటి సమస్యనైనా ఈజీగా తీసుకుంటాడు. కష్టకాలంలోనూ నిబ్బరం కోల్పోవడం నేనెరుగను. వైవాహిక జీవితం అన్న తర్వాత భేదాభిప్రాయాలు తప్పవు. మేమూ అంతే. సంగా మనసులో ఏదీ పెట్టుకోడు. ఏదైనా గొడవపడితే నాదే పైచేయి (నవ్వుతూ). సంగా తానే కాస్త వెనక్కి తగ్గుతాడు. లోపల ఒకలా, బయట మరోలా వ్యవహరించడం సంగాకు తెలియదు. మ్యాచ్ లు లేకుంటే ప్రతి క్షణం కుటుంబం కోసమే తపిస్తాడు. మంచి భర్త, మంచి తండ్రి... మొత్తమ్మీద ఫ్యామిలీ మ్యాన్! ఒంటరిగా ఉంటే మాత్రం పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తాడు. అన్నట్టు... మా ఆయన మంచివంటగాడు. పాస్తా అద్భుతంగా చేస్తాడండోయ్. మా పిల్లల పేర్లు స్వైరీ, కవిత్. ఇంకా క్రికెట్ బాట పట్టలేదు. ప్రస్తుతం టెన్నిస్ మొదలుపెట్టారు" అని వివరించింది.

  • Loading...

More Telugu News