: 5,600 ఏళ్ల బంగారం చరిత్ర ఇదే!
అందరూ మెచ్చే, అందరికీ నచ్చే, విలువైన లోహం బంగారం వాడకం దాదాపు 5,600 ఏళ్ల క్రితమే మొదలైందన్న సంగతి మీకు తెలుసా? బంగారం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయని, తొలుత ప్రేమను వ్యక్తపరచుకునేందుకు వాడిన గోల్డ్, క్రమక్రమంగా ప్రపంచ జీవన విధానాన్నే మార్చేసిందని తెలుసా? 5,600 ఏళ్ల బంగారం చరిత్ర 'ap7am.com' పాఠకుల కోసం సంక్షిప్తంగా... బంగారం ఎందుకంత గొప్ప లోహం? ఇది ప్రపంచంలో చాలా అరుదుగా లభించే లోహం. మెరిసే గుణం ఉండటం, స్వచ్ఛంగా ఉండటం, సాగే గుణం, ఎంతకాలమైనా చెక్కు చెదరని లక్షణాలు బంగారాన్ని ప్రజలకు దగ్గర చేశాయి. క్రీస్తు పూర్వం బంగారం వాడకం: క్రీస్తు పూర్వం 3600 సంవత్సరంలో ఈజిప్టులో తొలిసారి బంగారాన్ని వెలికితీసినట్టు, వారే తొలి బంగారు ఆభరణాలు వాడినట్టు చరిత్రకారులు ఆధారాలు సేకరించారు. క్రీ.పూ. 2600 సంవత్సరాల్లో గ్రీస్ పాలకుల శాసనాల్లో బంగారం ప్రస్తావన ఉంది. క్రీ.పూ.1223లో ఈజిప్టులో టుటెంకుమెన్ చక్రవర్తి కోసం పనివారు ఓ బంగారపు తొడుగును తయారు చేశారు. ఆపై క్రీస్తు పూర్వం 1200 సంవత్సరానికి బంగారం పోత పద్ధతి వాడుకలోకి వచ్చింది. క్రీ.పూ. 564 సంవత్సరంలో టర్కీలో తొలి బంగారు నాణాలు చలామణి కాగా, ఆపై మరో 130 ఏళ్ల తరువాత చైనాలో చదరంగా ఉండే బంగారు నాణాలను తయారు చేశారు. క్రీ.పూ. 433లో పర్షియన్లపై దాడి చేసిన అలగ్జాండర్ వారు దాచుకున్న పసిడి నిధిని కొల్లగొట్టాడు. క్రీ.పూ. 58లో తాను కొల్లగొట్టిన బంగారంతో దేశం అప్పును రోమన్ చక్రవర్తి సీజర్ తీర్చాడని, తొలిసారిగా బంగారాన్ని కరెన్సీ రూపంలో వాడినది రోమ్ లోనేనన్న ఆధారాలున్నాయి. ఆధునిక కాలంలో..: 14వ శతాబ్దంలో ప్రజల వద్ద ఉన్న బంగారం సమీకరణకు స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఇన్కా, ఆజ్ టెక్ రాజ్యాలపై భీకర దాడులు చేసి అక్కడి బంగారాన్ని దోపిడీ చేశాడు. 14వ శతాబ్దం తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి బంగారు నాణాలు వచ్చేశాయి. సులువుగా కరిగే లోహం కావడంతో నాణాల తయారీ సులభమైంది. ప్రకృతిలో అరుదుగా దొరికే లోహం కావడం, రంగు, స్వచ్ఛత, మన్నిక ప్రత్యేకతలుగా, చూడగానే ఆకట్టుకునే బంగారాన్ని నగదుగా వాడవచ్చని భావిస్తూ, తొలిసారిగా బ్రిటన్ లో గోల్డ్ స్టాండర్డ్ కరెన్సీని ప్రవేశపెట్టారు. బంగారం నిల్వల ఆధారంగా కరెన్సీ ముద్రణ కూడా ప్రారంభమైంది. 19వ శతాబ్దం నాటికి చైనా మినహా అన్ని పెద్ద దేశాల్లో గోల్డ్ స్టాండర్డ్ కరెన్సీ విధానం మొదలైంది. మరింత ఆసక్తిని కలిగించే అంశాలు: * 1799లో నార్త్ కరోలినాలో 12 ఏళ్ల బాలుడికి 17 పౌండ్ల బంగారు ముద్ద దొరికింది. దీని విలువ ఇప్పుడు సుమారు 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.2 కోట్లు). దీన్ని వేలానికి పెడితే, కోట్ల డాలర్లలో ధర పలుకుతుందని అంచనా. * 1848లో కాలిఫోర్నియాలో బంగారు గని వెలుగులోకి రాగా, ఆపై రెండేళ్లలో శాన్ ఫ్రాన్సిస్కో జనాభా 1000 నుంచి 25 వేలకు చేరింది. * 1896లో యుకాన్ సమీపంలోని క్లోండిక్ నదీ పరీవాహ ప్రాంతంలో బంగారం గని బయటపడటంతో, అక్కడికి వెళ్లాలని లక్షల మంది బయలుదేరారు. చివరికి క్లోండిక్ చేరింది వేల మంది మాత్రమే. వీరంతా ఐదేళ్ల పాటు శ్రమించి సేకరించిన బంగారం వారి ప్రయాణ ఖర్చులకు సరిపోయిందట. * తొలిసారిగా అంతరిక్ష యాత్ర జరిపినప్పుడు బంగారం ఎంతో ఉపకరించింది. బంగారంపై పడే సూర్యకాంతి వేగంగా పరావర్తనం చెందడమే ఇందుకు కారణం. * ఒక్కో స్పేస్ షటిల్‌లో కనీసం 40 కిలోల బంగారాన్ని వాడతారు. * ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1,71,300 టన్నుల బంగారం నిల్వలున్నట్టు అధికారిక అంచనా. * వివిధ దేశాల ప్రభుత్వాల వద్ద, బ్యాంకుల వద్ద 31 వేల టన్నుల బంగారం ఉండగా, మిగతాది ప్రజల వద్ద ఉంది. * యుఎస్ బులియన్ డిపాజిటరీ వద్ద సుమారు 5 వేల టన్నుల బంగారం ఉండగా, దీన్ని రక్షించేందుకు ప్రత్యేక అటామిక్ బాంబ్ వాల్ట్ ను ఆ దేశం రూపొందించింది. దీని ప్రధాన ద్వారం బరువు 22 టన్నులు కాగా, నిత్యమూ 30 వేల మందితో పహారా కాస్తుంటారు. * ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వద్ద 6,718 టన్నుల బంగారం ఉండగా, భూమికి 80 అడుగుల లోతున నిర్మించిన భవనంలో దీన్ని భద్రపరిచారు. * ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారు గని సౌతాఫ్రికాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3.9 కి.మీ లోతులో ఉండగా, ఒక టన్ను ముడి ఖనిజం నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం బరువు కేవలం గ్రాముల్లోనే ఉంటుంది. * 2002లో బంగారం ధర ఔన్సుకు 300 డాలర్లు. ప్రస్తుతం 1,100 డాలర్ల వద్ద ఉంది. ఐదేళ్ల క్రితం ఓ దశలో 1600 డాలర్లకు కూడా వెళ్లింది. * ప్రస్తుతం బంగారాన్ని అత్యధికంగా వెలికితీస్తున్నది చైనా కాగా, ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, అమెరికా, సౌతాఫ్రికాలు ఉన్నాయి. * వెలికితీస్తున్న మొత్తం బంగారంలో 50 శాతం ఆభరణాల తయారీకి, 40 శాతం పెట్టుబడిగా, మిగిలినది శాస్త్రసాంకేతిక రంగంలో వాడుతున్నారు. * రేడియేషన్ నుంచి రక్షించే లోహాల్లో బంగారమే చౌక * బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. * 24 క్యారెట్లంటే 100 శాతం స్వచ్ఛమైన బంగారం. * బంగారంలో ఎన్నో రంగులున్నాయి. - యల్లో గోల్డ్ (22 క్యారెట్): 91.67 బంగారం, 5 శాతం వెండి, 2 శాతం రాగి, 1.33 శాతం జింక్ - రెడ్ గోల్డ్ (18 క్యారెట్): 75 శాతం బంగారం, 25 శాతం రాగి - పింక్ గోల్డ్ (18 క్యారెట్): 75 శాతం బంగారం, 20 శాతం రాగి, 5 శాతం వెండి * బంగారంలో పెట్టుబడికి నాలుగు రకాల పద్ధతులున్నాయి. అవి బులియన్, నాణాల కొనుగోలు, ఈక్విటీ, ఇటిఎఫ్ * చైనా, ఇండియా నుంచే 50 శాతం బంగారానికి డిమాండ్ * ఇండియాలో తలసరి బంగారం 0.48 గ్రాములు కాగా, చైనాలో అది 0.37 గ్రాములు * నెలసరి ఆదాయంలో 1.9 శాతం బంగారానికి కేటాయిస్తున్న భారతీయులు. అదే చైనాలో 0.4 శాతం అమెరికాలో 0.1 శాతం మాత్రమే * బంగారం కొనకుండా జరిగే వివాహాలు ఇండియాలో అత్యంత అరుదు. * ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న బంగారంలో 28 శాతం ఇండియాకు, 27 శాతం చైనాకు. అమెరికాకు వెళ్లేది 6 శాతమే. * ఏదైనా లోహాన్ని దాచుకోవాలంటే ప్రజలు ఎక్కువ భయపడేది బంగారం గురించే. * వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, స్థూల జాతీయోత్పత్తి, రుణాలు, ఆర్థిక అనిశ్చితి, ఇటిఎఫ్ ల్లో పెట్టుబడి... ఈ అంశాలన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపేవే. * లెజండరీ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ పెట్టుబడుల్లో బంగారానికి లభించని స్థానం. ఏదిఏమైనా బంగారం బంగారమే!