: బ్రోకర్ అవతారమెత్తిన లలిత్ మోదీ... ‘సహారా’ హోటళ్ల అమ్మకానికి తెర వెనుక యత్నాలు
భారత దేశ రాజకీయాలనే ఓ భారీ కుదుపునకు గురి చేసిన ఐపీఎల్ మాజీ బాస్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోదీ, తాజాగా బ్రోకర్ అవతారం ఎత్తారట. ఈ మేరకు నిన్న అమెరికా రియల్ ఎస్టేట్ కంపెనీ మేడిసన్ కేపిటల్ సుప్రీంకోర్టుకు చెప్పింది. లలిత్ మోదీ సూచనల మేరకే తాము సహారా గ్రూప్ ఆధ్వర్యంలోని హోటళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వివరాల్లోకెళితే... సహారా గ్రూప్ నకు అమెరికాతో పాటు లండన్ లోనూ లగ్జరీ హోటళ్లున్న విషయం తెలిసిందే. డిపాజిటర్లను నిండా ముంచిన ఆ సంస్థ యజమాని సుబ్రతో రాయ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ములో 10 శాతం డిపాజిట్ చేస్తేనే బెయిల్ మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయితే అమెరికా, లండన్ లోని ఆస్తుల విక్రయానికి ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో ఏడాదికిపైగా ఆయన జైల్లోనే మగ్గిపోతున్నారు. తాజాగా అమెరికా, లండన్ లోని సహారా హోటళ్లను కొంటామని మేడిసన్ కేపిటల్ తో పాటు లండన్ కు చెందిన కానే కేపిటల్ పార్ట్ నర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పిటిషన్లలో పేర్కొన్న మోదీ ఎవరని ఆరా తీశారు. ఆ మోదీ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీయేనని సదరు కంపెనీలు తెలిపాయి. సుబ్రతో రాయ్ కుమారుడు సుశాంతో రాయ్ మాటమాత్రంగా సాయమడిగారని, ఈ క్రమంలోనే లలిత్ మోదీ తమను సంప్రదించారని ఆ కంపెనీలు కోర్టుకు తెలిపాయి.