: రవిశాస్త్రి మాటలు బాగానే చెబుతాడు కానీ, వాటితో మ్యాచ్ లు గెలవలేమంటున్న బీజేపీ ఎంపీ


శ్రీలంకతో తొలి టెస్టులో కోహ్లీ సేన ఘోర పరాజయం పాలవడం పట్ల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారత టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి మాటలకే పరిమితమని అన్నారు. శాస్త్రి మాటలు బాగానే చెబుతాడని, కానీ, ఆ మాటలతో మ్యాచ్ లు గెలవలేమని విమర్శించారు. టీమిండియా కోచ్ పదవిని చేపట్టడానికి రవిశాస్త్రి సరైన వ్యక్తి అని ఆజాద్ భావించడం లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. "శాస్త్రి మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తి. సత్ఫలితాలు సాధించాలంటే అదొక్కటే సరిపోదు" అని పేర్కొన్నారు. కోచ్ ను ఎంపిక చేయాల్సిన బృందం తెగువ చూపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. టీమిండియా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్భయంగా వారు సరైన కెప్టెన్ ను ఎంపిక చేయాలని సూచించారు. టీమిండియా హెడ్ కోచ్ పగ్గాలు చేపట్టేందుకు ద్రావిడ్ అన్ని విధాలా అర్హుడని ఆజాద్ అభిప్రాయపడ్డారు. మరేమీ ఆలోచించకుండా అతనికి బాధ్యతలు అప్పగించవచ్చని స్పష్టం చేశారు. కోచ్ పదవికి ద్రావిడ్ ను మించిన వ్యక్తి మరెవ్వరూ లేరని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News