: మా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర ఇది: పేలుళ్లపై థాయ్ మంత్రి
తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగంగా బాంబు పేలుళ్లు జరిగాయని థాయ్ లాండ్ రక్షణ మంత్రి ప్రవిత్ వాంగ్ సువాన్ పేర్కొన్నారు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ఎరవాన్ ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటనా స్థలిని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగంగా, టూరిజంను అడ్డుకునేందుకు జరిగిన దాడి అని అన్నారు. కాగా, ఈ దాడికి కారణం ఎవరు? అన్నది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. దాడిలో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా, పలువురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడగా, వాహనాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర్లో బాంబు పేలుడు జరగడంతో వీడియో పుటేజీల ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.