: వారణాసి వద్ద గంగానదిలో విగ్రహాల నిమజ్జనంపై నిషేధం
గంగ, యమున నదుల్లో విగ్రహ నిమజ్జనం చేయవద్దంటూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని గంగా నదిలో దేవతా మూర్తుల విగ్రహాల నిమజ్జనం నిషేధం అంటూ అధికారులు పట్టణ ప్రజలకు తెలిపారు. నదుల కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. త్వరలో రానున్న గణేష్, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అయితే అధికారులు సూచించిన నీటి కొలనులు, ఇతర చోట్ల మాత్రమే విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని పట్టణ వాసులకు సూచించారు. కాగా, గణేష్, దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించే వారణాసిలో వేడుకల అనంతరం గంగానదిలో విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. విగ్రహాల్లో వాడుతున్న రసాయనాల కారణంగా గంగానది కలుషితమవుతోందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపధ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.