: ఏపీ అభివృద్ధిని తెలంగాణ అడ్డుకుంటోంది: కేఈ


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలంగాణవాళ్లు అడ్డుకుంటున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీకి చెందిన ఆఫీసులకు తెలంగాణ ప్రభుత్వం తాళాలు వేయిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదిలోనే రైతు రుణమాఫీ, ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేశామని అన్నారు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లాను విద్యా, వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 'సీఎం అందరివాడు, అంతకన్నా ముందు రాయలసీమవాడు' అని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం కంకణం కట్టుకున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా శ్రీశైలం నీళ్లన్నీ రాయలసీమకు ఇచ్చిన సీఎం, పట్టిసీమ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News