: ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు నోటీసులిస్తాం: వైకాపా
ఎంపీల విధులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. తమ ఎంపీలకున్న న్యాయబద్ధమైన విధులను కూడా టీడీపీ నేతలకే రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోందని మండిపడ్డారు. ఆరోగ్య మిషన్ మానిటరింగ్ ఛైర్మన్లుగా వైకాపా ఎంపీలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తే... ఆ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, తమ ఎంపీలను ఆ స్థానంలో నియమించిందని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతల అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29వ తేదీన చేపట్టిన బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.