: ప్రపంచానికి భారత్ పరిచయం చేసిన అత్యద్భుత వంటకాలివి!
భారతీయులు భోజన ప్రియులు. ఇక్కడ లభించినన్ని వంటకాల వెరైటీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. శాకాహారమైనా, మాంసాహారమైనా ప్రపంచానికి ఇండియా పరిచయం చేసిన వంటకాలెన్నో ఉన్నాయి. అల్పాహారాల నుంచి, కూరలు తదితర సైడ్ డిష్ ల వరకూ ఎన్నో రకాల తయారీ ఇండియాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా జిహ్వార్తిని తీరుస్తున్నాయి. ప్రపంచానికి ఇండియా అందించిన అత్యద్భుత వంటకాల్లో కొన్ని ముఖ్యమైనవి... దోశ, చట్నీ, సాంబార్: అల్పాహారంగా అత్యధికులు తీసుకునే వెరైటీ ఇదే. ఎన్ని రకాల మాంసాహార వంటకాలున్నా, ఫేమస్ ఇండియన్ ఫుడ్ వెరైటీగా, నిత్యమూ కోట్లాది మంది కోరుకునే టిఫిన్ ఐటం దోశ మాత్రమే. విండాలూ: పోర్చుగీసు వారి వంటకం 'కార్నే డీ విన్హా డీ అల్హోస్' ప్రేరణతో గోవాలో తొలిసారిగా తయారైన మాంసాహార వంటకమిది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లలో విండాలూ ఇప్పుడు హాట్ ఫేవరెట్ చాట్: అది భేల్ పూరీ కావచ్చు, ఆలూ టిక్కా కావచ్చు, వడా పావ్ కావచ్చు, పానీ పూరీ కావచ్చు. రోడ్ల పక్కన నిలబడి బండిపై అమ్మే చాట్ తింటుంటే ఎంతో మజాగా ఉంటుంది. ఇప్పుడీ చాట్ వెరైటీలకు కు ప్రపంచవ్యాప్తంగా స్టార్ హోటల్స్ నుంచి వీధి బండ్ల వరకూ స్థానం లభించింది. రసగుల్లా: రసగుల్లా అనగానే బెంగాలీ వంటకం అనుకుంటారు కానీ, శతాబ్దాల క్రితం మొదటిగా ఓడిశాలో ఈ వంటకాన్ని కనిపెట్టారు. పేరు వింటేనే నోరూరిపోతూ, స్పాంజ్ ని తలపిస్తూ, మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ స్వీట్ వెరైటీ బెంగాలీలకు ఎంతో ఫేమస్ అయిపోయింది. ఆపై గ్లోబల్ ఫేవరెట్ గా మారింది. బటర్ చికెన్: ఇండియా, పాకిస్థాన్ విభజన సమయంలో పాత ఢిల్లీ వీధులలో బటర్ చికెన్ వెరైటీ తొలిసారిగా తయారైంది. తీయటి టొమాటో గ్రేవీ, చికెన్, వెన్న కలిసిన రుచి మాంసాహార ప్రియులందరికీ దగ్గరైంది. సమోసా: సమోసాలు మధ్య ఆసియా ప్రాంతంలో శతాబ్దాల క్రితమే తయారైనట్టు తెలుస్తున్నా, అందులో ఆలూ, బటానీలతో చేసిన కర్రీ పెట్టి మరింత రుచిని పెంచింది మాత్రం భారతీయులే. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లలో, టీ స్టాల్స్ లో సమోసాలకు స్థానం తప్పనిసరి అయింది. చికెన్ టిక్కా మసాలా: ఈ వంటకం ఎవరు కనిపెట్టారన్న విషయంలో కొంత చర్చ జరిగినా, ఇది కూడా భారత వంటకమేనని తేల్చేశారు. ఇప్పుడిది బ్రిటన్ లో అత్యంత ఫేవరెట్ డిష్. 2009లో దీన్ని ప్రమోట్ చేసేందుకు పెద్ద ప్రచారమే జరిగింది. దీన్ని మేమే తయారు చేశామని బ్రిటన్ చెప్పుకున్నా, లెజండరీ చెఫ్ శ్రీమతి బల్బీర్ సింగ్ తయారు చేసిన షాహీ చికెన్ మసాలా నుంచే దీన్ని తయారు చేశారని ఆహార చరిత్ర కారులు కనుగొన్నారు. ఇది కూడా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ అన్ని దేశాల మెనూలోకి చేరిపోయింది. చనా మసాలా: పంజాబ్ లో దొరికే చోళే నుంచి, కేరళలోని ఆపమ్ వరకూ, చనా మసాలా లేకుంటే తినలేని పరిస్థితి. రాజస్థాన్ సంప్రదాయ వంటకంగా, ప్రపంచ ప్రసిద్థి పొందింది. గాజర్ హల్వా: క్యారెట్లతో కూడా రుచికరమైన హల్వాను చేయవచ్చని కనుగొన్న భారతీయులు దాన్ని ప్రపంచ ఫేవరెట్ డిష్ లలో ఒకటిగా చేశారు. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార, క్యారెట్ తురుములతో తయారయ్యే ఈ వంటకం భోజనం తరువాత తీసుకునే 'డెజర్ట్స్'లో పర్మినెంట్ ప్లేస్ ను పొందిందనడంలో సందేహం లేదు. అప్పడాలు: భోజనంలో ఎన్ని రకాల ఆహార పదార్థాలున్నా అప్పడాలు లేకుంటే ముద్ద దిగదు. ప్రపంచంలో 100కు పైగా పాపడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో లభించే అతి కొద్ది వెరైటీలలో అప్పడాలు ఒకటి. వీటితో పాటు టిఫిన్ వెరైటీల్లో ఇడ్లీ, ఊతప్పం, పొంగల్, ఆలూ బోండా వంటివి, భోజనంలో బిస్ బెలీ బాత్, పప్పు, వివిధ రకాల కూరలెన్నింటినో ఇండియా ప్రపంచానికి పరిచయం చేసింది.