: టీడీపీ, బీజేపీ మధ్య ముదిరిన వివాదాలు.... బీజేపీ ఎంపీ ఇంటికెళ్లి ఓదార్చిన ఏపీ మంత్రి గంటా


కేంద్ర ప్రభుత్వంలో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఉప్పు, నిప్పులా ఉంటున్నాయి. ఈ రెండు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య నెలకొంటున్న ప్రొటోకాల్ వివాదాలు పెరుగుతున్నాయి. బీజేపీతో స్నేహ పూర్వకంగా నడచుకునే విషయమై ఏపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మొన్న జరిగిన పంద్రాగస్టు వేడుకలు జరిగిన తీరు, ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అగాధాన్ని మరింతగా పెంచాయి. అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యత నిస్తూ తమను నిర్లక్ష్యం చేశాయని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వేడుకల సందర్భంగా తమను చిన్న చూపు చూశారని విశాఖ ఎంపీ హరిబాబు అలగడంతో, ఆయన్ను అనునయించే బాధ్యతలను మంత్రి గంటా శ్రీనివాసరావు భుజాలపై చంద్రబాబు వేశారట. విశాఖ ఎంపీగా చంద్రబాబు పక్కన ముందు వరసలో కూర్చోవాల్సిన తనకు, ఎక్కడో దూరంగా సీటు కేటాయించారని, స్థానిక ఎమ్మెల్యేకూ ఇదే అవమానం జరిగిందని ఆయన అధికారులపై విరుచుకుపడ్డారట. తప్పు తెలుసుకున్న అధికారులు ఆయన్ను వేదికపైకి ఆహ్వానించినా, హరిబాబు నిరాకరించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు, పరిస్థితి చక్కదిద్దాలని గంటాకు సూచించారని సమాచారం. దీంతో హరిబాబు ఇంటికి వెళ్లిన గంటా శ్రీనివాసరావు, ఇకపై అలా జరగబోదని హామీ ఇచ్చారట. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని చెప్పారట. ఆ తరువాత హరిబాబు మీడియా ముందుకు వచ్చి, ఇలాంటి చిన్న చిన్న అంశాలను పట్టించుకోనని వెల్లడించడంతో ఇప్పటికి సమస్య సద్దుమణిగినట్లయింది.

  • Loading...

More Telugu News