: భారత బ్యాంకుల్లో వేలకొద్దీ కొత్త ఉద్యోగాలు!


భారత్ లోని వివిధ బ్యాంకులు కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపట్టక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వచ్చే రెండేళ్లలో సుమారు 80 వేల మంది పదవీ విరమణ చేయనుండటంతో కొత్తగా ఉద్యోగాల భర్తీకి బ్యాంకులు సమాయత్తం అవుతున్నాయి. ఈ సంవత్సరం 29,756 మంది రిటైర్ అవుతారని బ్యాంకు వర్గాల అధికారిక అంచనా. ఇందులో 19,065 మంది ఆఫీసర్లు, 14,669 మంది క్లర్కులతో పాటు 6,022 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక వచ్చే సంవత్సరం 39 వేల మంది పదవీ విరమణ చేయనుండగా, ఇందులో 18,506 మంది ఆఫీసర్లు, 14,458 మంది క్లర్కులున్నారు. ఎస్బీఐలో మార్చి 2016లోపు 8,674 మంది రిటైర్ కానున్నారని బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. అందరినీ కాకపోయినా, మార్చిలోగా 2 వేల మందిని విధుల్లోకి నియమించుకుంటామని ఆమె వివరించారు. కాగా, మధ్యస్థాయి ఉద్యోగ నియామకాల్లో బ్యాంకులకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. బ్యాంకులు తమ విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా కొందరిని విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 22 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా, ఎస్బీఐకి మరో 5 అనుబంధ బ్యాంకులున్నాయి. మరోవైపు క్యాంపస్ నియామకాలు చేపట్టాలని కూడా బ్యాంకులు భావిస్తుండగా, ఇందుకు న్యాయపరమైన చిక్కులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News